కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మే నెల 23, 24 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ పాలకమండలి నిర్ణయించింది. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, జాతర పత్రికను ఆమె పాదాలముందు ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. జాతరలో ప్రధాన ఘట్టాలైన గంగమాంబ శిరస్సు ఊరేగింపు మే 23వ తేదీన, అమ్మవారి విశ్వరూప దర్శనం 24న జరుగుతుంది. కాగా జాతర సంబరాలు మే నెల 17వ తేదీన వినాయకస్వామి ఉత్సవంతో ప్రారంభమవుతాయి. అదేనెల 18న అమ్మవారి ఊరేగింపు, 19న శేషవాహన సేవ, భక్తులకు అన్నదానం, 20న సింహవాహన సేవ, 21న అశ్వవాహన సేవ, 22న అగ్నిగుండ ప్రవేశం నిర్వహిస్తారు. 24వ తేదీన అమ్మవారి విశ్వరూప దర్శనం అనంతరం రాత్రి జలావాసమేగడంతో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు ముగుస్తాయి. ఆలయ పాలకమండలి ఛైర్మన్ కేఏ.మంజునాథ్, పుర ప్రముఖులు, ఆలయ పూజారులు, ఈ పూజల్లో పాల్గొన్నారు.