మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ విషయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మరో 48 గంటల వ్యవధిలో ఇంకో కీలక అరెస్టు ఉండే అవకాశాలు లేకపోలేదని అన్నారు. సదరు కీలక అరెస్టుకు మూడు, నాలుగు గంటల సమయం పడుతుందా.. లేక 48 గంటలు పడుతుందా..? అనేది తెలియాల్సి ఉందన్నారు. హైకోర్టులో సోమవారం డాక్టర్ సునీత తరఫు న్యాయవాదితో పాటు, సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారని చెప్పారు. ఇప్పటికే జరిగిన రెండు అరెస్టులతో పాటు, కోర్టుకు వెళ్లేలోగానే కీలకమైన మూడో అరెస్టు కూడా జరిగితే, తమపని తాము చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీబీఐ అధికారులు హైకోర్టు న్యాయమూర్తికి విన్నవించే అవకాశం ఉందని చెప్పారు.