అనంతపురం రీజియనలో ఏపీఎస్ ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే ఆర్టీసీ అధికారులు పూర్తిచేశారు. 2016 తర్వాత ఇంతవరకూ కారుణ్య నియామకాల భర్తీ చేపట్టలేదు. దీంతో 2016 నుంచి 2019 మధ్య మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల సంతానానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించేందుకు ఇప్పటికే అభ్యర్థులకు కాల్ లెటర్లను పంపారు. కాగా 2016-19 మధ్య వివిధ కారణాలతో మరణించిన, ఉద్యోగ విరమణ పొందిన, బదిలీ పొందిన కండక్టర్ల ఖాళీలను కనబర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్‌ఎం కార్యాలయం వద్ద కూడా ఎలాంటి నోటీసులు ప్రదర్శించకుండా, పేపరు ప్రకటనలు కూడా ఇవ్వకుండా తాము అనుకున్న అభ్యర్థులకే కాల్ లెటర్లు పంపడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. మరోవైపు ఆర్టీసీలోని కొందరు అధికారులే మధ్యవర్తులను ఏర్పాటుచేసుకుని అభ్యర్థుల నుంచి ఒకో పోస్టుకు ఒకో రేటు వసూలు చేసి గుట్టుచప్పుడు కాకుండా తాము అనుకున్నవారికి కాల్‌లెటర్లు పంపారంటూ మరికొందరు అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి.