ఓ మహిళను పాము కాటువేయడంతో చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడలేని ఆమె భర్త ఈ విషయం తెలుసుకుని.. ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటికి చేరుకున్నాడు. తన భార్యను కరిచిన పామును పట్టుకుని సంచిలో వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ పరిణామానికి అవాక్కైన ఆస్పత్రి సిబ్బంది, అక్కడ ఉన్నవారు.. ఎందుకు తీసుకొచ్చావని అడిగారు. దీనికి అతడు చెప్పిన సమాధానం విని వారంతా విస్తుపోయారు. భయంకరమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది. సఫీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్ అత్వా గ్రామంలో నరేంద్ర, అతడి భార్య కుసుమ ఉంటున్నారు.
కుసుమ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఓ పాము ఆమెను కాటేసింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుసుమ అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు అక్కడకు చేరుకుని.. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. భార్యకు పాము కరిచిందన్న విషయం తెలుసుకున్న నరేంద్ర.. ఆమె ఎలా ఉందో చూసేందుకు హాస్పిటల్కు రాలేదు. నేరుగా తన నివాసానికి చేరుకుని, భార్యను కాటేసిన పామును పట్టుకున్నాడు. దాన్ని సంచిలో వేసుకొని అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పామును చూసి ఆసుపత్రి సిబ్బంది ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగారు.
తన భార్యను ఏ పాము కాటేసిందో చూపిస్తే దానికి తగ్గట్టుగానే వైద్యం అందించడానికి వీలు పడుతుందని అతడు చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. కుసుమ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. పామును అడవిలో వదిలేయాలని సూచించారు. ఇదే జిల్లాలోని మఖి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పాము కాటుకు గురికావడంతో ఆమెతో పాటు ఆ విష కీటకాన్ని ఆస్పత్రికి వచ్చాడు. ‘నా భార్యను ఏ పాము కరిచిందని అడిగితే ఎలా తెలుస్తుంది? మీరే చూడాలని పామును తీసుకొచ్చాను’ అని చెప్పడంతో డాక్టర్లు షాక్ తిన్నారు.