మానవత్వం పరిమళించిన ఓ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. అలీగఢ్ స్వర్ణ జయంతి నగర్ ఎంప్లాయీ కాలనీలో నివాసం ఉండే లత అనే మహిళ.. సోమవారం ఉదయం పాల కోసం దుకాణానికి వెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. గేటు వద్ద ఉన్న ఓ చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. ఆమె దగ్గరకు వెళ్లి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. దీంతో వెంటనే బిడ్డను చేతుల్లోకి తీసుకొని చుట్టుపక్కల వారందరినీ ఆరా తీసింది. ఆ బిడ్డ ఎవరో తమకు తెలియదని వారు చెప్పడంతో ఆ శిశువును తన ఇంటికి తీసుకెళ్లింది. చిన్నారికి శుభ్రంగా స్నానం చేయించి పాలు పట్టింది. బిడ్డను దత్తత తీసుకొని, తన పేరు మీద ఉన్న ఆస్తిలో సగం ఇప్పుడే పాప పేరు మీద రాయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు లత పెద్ద మనసును అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు.
దీనిపై లత మాట్లాడుతూ.. సోమవారం ఉదయం పాల ప్యాకెట్ల కోసం వెళ్తుండగా.. గేటు వద్ద ఉన్న చెత్త కుండిలో నుంచి ఓ పసిపాప ఏడుపు వినిపించిందని తెలిపింది. అక్కడకు వెళ్లి చూడగా నవజాత శిశువు కనిపించిందని, చుట్టుపక్కల వారిని అడిగితే తమకు తెలియదన్నారని పేర్కొంది. బిడ్డను ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి పాలు పట్టి నిద్రిపుచ్చానని చెప్పింది. దత్తత తీసుకుని, తన పేరున ఉన్న సగం ఆస్తిని ఇస్తానని వెల్లడించింది.