ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లాలో పెద్దపులి గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల్ని వేటాడుతోంది. మూడు రోజుల వ్యవధిలో పులి పంజాకు ఇద్దరు బలయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చర్యలు చేపట్టారు. పౌరి జిల్లాలోని మొత్తం 25 గ్రామాల పరిధిలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆసీస్ చౌహాన్ మాట్లాడుతూ.. 25 గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు వెల్లడించారు.. మంగళవారం వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించినట్టు తెలిపారు. రిఖ్నిఖాల్ బ్లాక్‌లో సగం తిని వదిలి వెళ్లిన ఓ మృతదేహాన్ని గ్రామస్థులు ఆదివారం గుర్తించారని ఫారెస్ట్ రేంజర్ మహేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఆ మృతదేహం సిమ్లీ గ్రామానికి చెందిన 75 ఏళ్ల రణ్‌వీర్‌సింగ్ నేగికి చెందినదిగా గుర్తించినట్టు పేర్కొన్నారు.
జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని సిమ్లీ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న రణ్‌వీర్ సింగ్ నేగికి.. డెహ్రాడూన్‌లోని అతడి బంధువులు శనివారం నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించడంలేదు. దీంతో ఆందోళన చెందినవారు ఆ గ్రామస్థులకు సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లాలని కోరారు. నేగి ఇంటికి వెళ్తున్న గ్రామస్థులకు మార్గమధ్యంలో రక్తపు మరకలు కనిపించాయి. అతడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించగా.. ఇంటికి 150 మీటర్ల దూరంలోనే మృతదేహాన్ని గుర్తించారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.
మరోవైపు, పులుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేయనున్నట్టు అటవీశాఖ అధికారి తెలిపారు. ఆ పులిని మనుషుల్ని వేటాడే జంతువుగా ప్రకటించాలని సీఎం పుష్కర్‌సింగ్ ధామీని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కునర్వార్ కోరారు. పులిని పట్టుకొడానికి చర్యలు చేపట్టిన అధికారులు.. గ్రామంలో ఓ బోనును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పశువులకు మేతను తీసుకొచ్చేందుకు గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లొద్దని సూచించారు. పశుసంవర్థక శాఖ ప్రస్తుతానికి ప్రజల ఇంటి వద్ద పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇదిలా ఉండగా, దల్లాలోని పొలాల్లో పులి సంచరిస్తుండగా, కొన్ని మీటర్ల దూరంలో పశువులు మేస్తున్నట్లు కనిపించిన వీడియో సోమవారం వైరల్ అయ్యింది. ఏప్రిల్ 13న సిమ్లీకి 25 కి.మీ. దూరంలోని దల్లా గ్రామంలోనూ బిరేంద్ర సింగ్ (72) అనే వ్యక్తిపై పులి దాడిచేసి చంపింది. పొలంలో అన్న ఆయనను వేటాడింది. దీంతో ఆ ప్రాంతంలో రాత్రిపూట అటవీ అధికారులు, పోలీసులు పహారా కాస్తున్నారు.