మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అధికారులు హంతకులను వదిలేసి భాస్కర్‌రెడ్డి, అవినాష్ రెడ్డి వెనుక పడ్డారని, రాజకీయ కారణాలతోనే ఇబ్బందులు పెడుతున్నారని అవినాష్‌రెడ్డి తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో అసలు వివేకా హత్యకు కారణాలు ఏంటని కోర్టు ప్రశ్నించింది. నాలుగు కారణాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి తరఫు లాయర్ చెప్పారు. 1) వివేకానందరెడ్డి రెండో భార్యతో సునీతకు విభేదాలున్నాయి 2) ఎర్ర గంగిరెడ్డితో వ్యాపార లావాదేవీల్లో గొడవలు ఉన్నాయి 3) సునీల్ యాదవ్ కుటుంబంతో విభేదాలు ఉన్నాయి 4) హత్యకు రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చు అని అవినాష్ రెడ్డి లాయర్ తెలిపారు.
ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాలని ఆదేశించింది. వాదనలు కొనసాగుతుండగానే.. ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. అవినాష్ రెడ్డి లాయర్, సునీత తరఫు లాయర్ మధ్య కోర్టులో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దస్తగిరి మీడియాతో చేసిన వ్యాఖ్యలను సునీత ఎలా సమర్థిస్తారని అవినాష్‌రెడ్డి లాయర్ ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత దస్తగిరి స్టేట్‌మెంట్‌తో అవినాష్ రెడ్డిని వేధించడం ఏంటని తన వాదనలు వినిపించారు. దస్తగిరి వ్యాఖ్యలను ఎందుకు సమర్థించారని సునీత లాయర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.