ఏపీ అంటనే ఎండలు కాస్త ఎక్కువేనన్నది మనం వినేమాట. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతోంది. రోజంతా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఎండలు భగభగమంటున్నాయి. కర్నూలు జిల్లాలో మంగళవారం రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. కర్నూలు రూరల్ మండలంలోని పాడూరులో ఈ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 45.35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యా్న్ మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సాధారంగా రోహిణికార్తె ఎండలకు రోళ్లు పగులుతాయని అంటారు. కానీ, రోళ్లు పగలడం ఏమో కానీ రోహిణి కార్తె రాకముందే కర్నూలు జిల్లాలో ఎండలకు కొండలు పగులుతున్నాయి. ఇటీవలే ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలోని గోనెగండ్లలో ఓ పెద్ద బండరాయి పగిలిపోయింది. భారీ శబ్దంతో ఈ రాయి పగిలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గోనెగండ్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో నరసప్ప దేవాలయం దగ్గర ఓ పెద్ద కొండరాయి ఉంది. ఆదివారం (ఏప్రిల్ 16వ తేదీ) మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడ నుంచి శబ్ధం వచ్చిందని వెళ్లి పరిశీలించగా పగిలిన రాయి నుంచి పొగతో పాటు చిన్న చిన్న ముక్కలు రాలి పోతుండటాన్ని గమనించారు.
ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి చేరవేశారు. ఆ కొండ చుట్టూ ఇళ్లు కూడా ఉన్నాయి. చీలిన కొండరాయిపై మరో రాయి ఉండడంతో కింద పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు పగుళ్లు ఇచ్చిన కొండ రాళ్లను తహసీల్దార్ వేణుగోపాల్ పరిశీలించారు. కొండరాళ్ల పక్కన ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామని తెలిపారు. మైనింగ్ అధికారుల సలహాలు సూచనలతో కొండరాళ్లను తొలగించే పనులు మొదలుపెడతామని ఆయన పేర్కొన్నారు. కొండ రాళ్ల పక్కన నివాసులున్నాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నికల్‌గా కొండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తామని వేణుగోపాల్ తెలిపారు. తాజాగా, కర్నూలు జిల్లాలో ఈ సీజన్‌తో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.