ప్రకాశం జిల్లా, కురిచేడు మండలంలోని బోదనంపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... వీరాంజనేయస్వామి దేవాలయం పక్క రోడ్డులో వేమా సుబ్బారావు, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి జయశ్రీ(2) అనే చిన్నారి ఒక్కటే. సుబ్బారావు పొలం పనులతో పాటు కరెంటు పనులు చేస్తుంటాడు. అనూషా కూడా పొలం పనులకు వెళుతుంటుంది. బుధవారం జయశ్రీ తల్లిదండ్రులు ఎవరి పనులకు వారెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. బాలిక బంతితో ఆడుతుండగా అది ఎగిరి ఇంటి ముందు ఉన్న పెద్ద నీటి తొట్టిలో పడింది. బాలిక బంతి కోసం తొట్టిలోకి వంగి చూస్తున్న క్రమంలో లోపలకు జారి పడింది. ఈ నేపథ్యంలో బాలిక కనిపించకపోవడంతో అనూషా ఇంటా బయట వెతికింది. అప్పటికీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెతకగా నీటి తొట్టిలో అడుగు భాగాన బాలిక కనిపించింది. వెంటనే బాలికను బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉంది. చిన్నారికి మూడో ఏడాది రాగానే తిరుపతిలో పుట్టెంట్రుకలు తీయించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈలోపే పాప మృతి వారిని కలచివేసింది. లేక లేక కలిగిన కుమార్తె అకాల మరణం వారిని కుంగదీసింది.