మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ను సీబీఐ కస్డడీలోకి తీసుకుంది. గురువారం ఉదయం సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు వెళ్లి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌లను రెండవ రోజు కస్టడీలోకి తీసుకుని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి న్యాయవాదులు కూడా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రోజు కస్టడీలో వైఎస్ వివేకా హత్య నిందితులతో ఉన్న పరిచయాలపై సీబీఐ ఆరా తీసింది. సునీల్ యాదవ్‌కు కోటి రూపాయలు ఇచ్చారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌లను సీబీఐ ప్రశ్నించింది. నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు ఇద్దరి విచారణ కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, ఎంపీ అవినాష్ రెడ్డిలను సీబీఐ విడివిడిగా విచారిస్తోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణాలను దృష్టి పెట్టుకుని ప్రత్యేక గదిలో విచారణ జరుపుతున్నారు. హైకోర్ట్ ఆదేశాల ప్రకారం... సిద్ధం చేసుకున్న ప్రశ్నలను అవినాష్ రెడ్డికి సీబీఐ ఇవ్వగా.. ఆ ప్రశ్నలకు అవినాష్ నుంచి లిఖిత పూర్వకంగా సీబీఐ సమాధానాలు రాబడుతోంది. విచారణ మొత్తన్ని స్టేట్‌మెంట్ రూపంలో సీబీఐ రికార్డ్ చేస్తోంది.