భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి శనివారం పీఎ్సఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు 16 కిలోల మరో చిన్న ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపనున్నారు. శుక్రవారం ఉదయం 11.49 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ 25.30 గంటలు కొనసాగిన తరువాత రాకెట్ షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. దీని రిహార్సల్‌ను శాస్త్రవేత్తలు గురువారం విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్లో భాగంగా రాకెట్‌ను మొబైల్ సర్వీసు టవర్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. రిహార్సల్ అనంతరం ప్రీ కౌంట్‌డౌన్ కూడా శాస్త్రవేత్తలు నిర్వహించి రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే, మిషన్ రెడీనెస్ సమీక్ష సమావేశాన్ని(ఎంఆర్ఆర్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తరువాత ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. అన్నీ సజావుగా సాగితే శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.