ఢిల్లీలోని సాకేత్ కోర్టు లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు తెగబడ్డారు. దాదాపు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి పరార్ అయ్యారు. ఈ కాల్పుల్లో ఓ మహిళతో పాటు లాయర్‌కు గాయాలవ్వగా.. ఇద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్స్ బ్లాక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులతో కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్లు, ప్రజలు ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాల్పులతో కోర్టు పరిసరాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. అక్కడ ఉన్నవారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ కడుపులో నుంచి రక్తం కారుతుండగా.. ఆమె నొప్పితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను కొంతమంది ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత భద్రత ఉండే కోర్టు ప్రాంగణంలో కాల్పులు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.