ఎయిర్ ఇండియా సంస్థ విమానంలో పనిచేసే ఓ పైలట్.. తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణ సమయమంతా ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకు దారి తీసింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో.. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరు ఆ ఫ్లైట్ పైలట్ ఫ్రెండ్. అయితే.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పైలట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు. విమానం ఢిల్లీ చేరుకునేంత వరకు.. దాదాపు మూడు గంటల పాటు ఆ మహిళను కాక్‌పిట్‌లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్‌లో కూర్చోబెట్టాడు. దీనిపై అదే విమాన సిబ్బంది ఫిర్యాదు చేయగా.. విషయం బయటపడింది.
దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ సీరియస్ అయ్యింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. పైలట్ చర్య నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని.. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దర్యాప్తు నివేదికను బట్టి పైలట్‌ను సస్పెండ్ చేయడం లేదా.. అతడి లైసెన్సును రద్దు చేసే వకాశమున్నట్లు తెలుస్తోంది.