ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని ఒక పోలీసు స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐపై గంజాయి వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకోగా, శుక్రవారం వారి కళ్లుగప్పి పరారైనట్టు ప్రచారం జరుగుతోంది. రెండ్రోజుల కిందట నెల్లూరు ఎస్‌ఈబీ అధికారులకు గంజాయితో వెళుతున్న ఓ కారు పట్టుబడింది. ఈ వ్యవహారంలో ఏజెన్సీకి చెందిన ఒక ఎస్‌ఐ తమ వద్ద డబ్బులు తీసుకున్నట్టు వారు వెల్లడించారని, దీంతో ఈ సమాచారం మేరకు సదరు ఎస్‌ఐని మరొక సబ్ డివిజన్‌కు చెందిన పోలీసు స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసు కోగా, ఆ స్టేషన్ నుంచి గంజాయి వ్యవహారంతో సంబంధం ఉన్న ఎస్‌ఐ తప్పించుకుని పరారైనట్టు చెబుతున్నారు. ఆ ఎస్‌ఐ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాల కోసం ప్రయ త్నించగా సంబంధిత పోలీసు అధికారులు అందుబాటులో లేరు.