విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వామపక్ష పార్టీలతో పాటు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని మే 3న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎన్‌కే గ్రౌండ్‌లో ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం స్వలాభం కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అనేక మంది ప్రాణత్యాగాలతో పరిశ్రమ నిర్మిస్తే దాన్ని కార్పొ రేట్ శక్తులకు అప్పగించేందుకు చూస్తోందన్నారు. బీజేపీని గద్దె దించేందుకు దేశంలో 21 సెక్యులర్ పార్టీలు ఐక్యంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ కేసులకు భయపడి పాలన సాగిస్తున్నాడన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సీపీఐ కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఐటీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమసుందర్, చింతకాయల బాబూరావు, కలిశెట్టి వెంక ట్రావు, నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.