నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన జాషువా అనే ఏడేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి కూరగాయల మార్కెట్‌కు వచ్చాడు. తల్లిదండ్రులు ఓ చోట కూరగాయలు కొనుగోలు చేస్తుండగా.. చిన్నారి మాత్రం పక్కనే ఉన్న చెరుకు రసం బండి వద్దకు వెళ్లాడు. చెరుకు మిషన్ నుంచి చెరుకు రసం ఎలా తీస్తున్నారనేది చాలాసేపు ఆసక్తిగా గమనించాడు. అనంతరం చెరుకు మిషన్ నడిపే వ్యక్తి దృష్టి మరల్చి మిషన్‌లో చేయిపెట్టాడు. అర చేయి సగం వరకు మిషన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి నొప్పితో విలవిల్లాడిపోయాడు.
గమనించిన చెరుకు మిషన్ నడిపే వ్యక్తి గట్టిగా కేకలు వేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు చిన్నారి చేయ బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. గంటల పాటు శ్రమించి రాడ్ల సాయంతో చిన్నారి చేతిని బయటకు తీశారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అది ఎలక్ట్రిక్ చెరుకు మిషన్ కాగా.. బాలుడు చేయి అందులో పెట్టినపుడు అది ఆన్‌లో లేదు. దీంతో పెను ప్రమాదం తప్పంది. మిషన్ ఆన్‌లో ఉండి ఉంటే చిన్నారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని స్థానికులు అన్నారు. పిల్లలు చేసే పనులను ఓ కంట కనిపెట్టాలని చిన్న పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పించినా.. మరికొన్ని సార్లు వారి ప్రాణాల మీదకు తెస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.