ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలోని పాప్డి గ్రామం. హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉంటుంది ఆ ఊరు. గ్రామ శివారులో ఆవుల మంద మేత మేస్తుండగా.. ఓ పెద్ద పులి మెల్లగా అక్కడికి వచ్చింది. ఆవుల మందను లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడింది. పులి రాకతో అప్రమత్తమైన ఆవులన్నీ తప్పించుకొని పారిపోగా.. ఓ దూడ మాత్రం దానికి చిక్కింది. ఇంకొద్ది సేపు అయితే ఆ పులి చేతిలో దూడ ప్రాణాలు కోల్పోయేదే.
కానీ తన బిడ్డ మీద పులి దాడి చేస్తున్న విషయాన్ని గమనించిన తల్లి ఆవు పరుగున అక్కడికి వచ్చింది. పులిని సైతం లెక్క చేయకుండా పోరాటానికి సిద్ధపడింది. దీంతో ఆవును చూసిన పులి అక్కడి నుంచి పరారైంది. నా బిడ్డ జోలికి వస్తావా.. అన్నట్టు ఆ ఆవు పులిని కొంత దూరం వరకు తరిమి కొట్టింది. మోహన్ పర్గేయిన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన బిడ్డ జోలికి వస్తే ఏ తల్లీ ఊరుకోదని.. ఎంతకైనా తెగిస్తుందని అనడానికి ఈ ఘటనే నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అమ్మ అత్యంత శక్తివంతురాలంటూ తల్లి ప్రేమను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక పులుల విషయానికి వస్తే.. ప్రపంచంలోని పెద్ద పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. మన దేశంలో పులుల సంఖ్య 3 వేలు దాటిందని ప్రధాని మోదీ ఇటీవలే వెల్లడించారు. 1972లో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించిన కేంద్రం.. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతో వాటి సంతతి క్రమంగా పెరుగుతోంది. మన దేశంలో ప్రస్తుతం 53 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి.