గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఊయలలో నిద్రిస్తోన్న ఏడు నెలల పసికందును ఈడ్చుకొచ్చిన వీధి శునకాలు.. దాడి చేశాయి. సర్ఖేజ్‌లోని సోనాల్ సినిమా రోడ్డులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ స్థానికులు సకాలంలో స్పందించడంతో ఆ పసికందు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పూజా అనే ఆ చిన్నారి తల్లిదండ్రులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ చిన్నారిని ఊయలలో వేసి వారిద్దరూ పనిలో నిమగ్నమైన సమయంలో వీధి కుక్కలు ఆ పసికందుపై దాడి చేశాయి. కొంత దూరంపాటు ఆ చిన్నారిని లాక్కెళ్లిన కుక్కలు.. ఒళ్లంతా కరిచాయి. ఇది గమనించిన కొంత మంది కుక్కలను తరిమేసి ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.
తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. చికిత్స అనంతరం కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. చిన్నారిని ఊయలలో వేసిన తల్లిదండ్రులిద్దరూ పనులు చేసుకుంటుండగా.. సడెన్‌గా కుక్కలు పాపపై దాడి చేశాయని మక్తంపుర కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ హజీ మీర్జా తెలిపారు. స్థానికులు గమనించి కుక్కలను తరిమేయకపోయి ఉంటే ఆ పాప చనిపోయి ఉండేదన్నారు.
అహ్మదాబాద్ నగరంలోనూ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 2022లో 58,688 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే 7457 కేసులు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. 2020-21లో లాక్‌డౌన్ కారణంగా కుక్క కాటు కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2019లో అహ్మదాబాద్‌లోని హాస్పిటళ్లు, అర్బన్ హెల్త్ సెంటర్లలో సుమారు 66 వేల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.