ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కేరళ పర్యటన ఏప్రిల్ 24న ప్రారంభం కానుండగా.. బెదిరింపులు రావడం కలకలం రేగుతోంది. ప్రధాని పర్యటన సమయంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గతవారం ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో అప్రమత్తమైన కేరళ పోలీసులు... రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. వాస్తవానికి ఈ బెదిరింపు లేఖ గతవారం రాగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోదీ కోచి పర్యటనలో ఆత్మాహుతి దాడులు చేస్తామని అందులో బెదిరించారు.
ఈ లేఖను అదనపు డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్ విభాగం) టీకే వినోద్ కుమార్‌కు కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ అందజేశారు. దీంతో ఈ అంశంపై ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. అయితే, ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రొటోకాల్స్‌పై ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవడంతో బెదిరింపు లేఖ విషయం బయటికొచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన కేరళ పోలీసులు.. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ కావడం వివాదాస్పదమైంది.
ఎంపిక చేసిన అధికారులతో మాత్రమే పంచుకున్న ఈ సమాచారం వాట్సాప్‌లో వైరల్ కావడంతో పోలీసులు షాకయ్యారు. ప్రతి పాయింట్ వద్ద మోహరించాల్సిన పోలీసుల సంఖ్య, ప్రతి వ్యూహాత్మక పాయింట్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అధికారుల పేర్లు, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లే రూట్‌ల వివరాలు ఉన్నాయి. ఇది మీడియా లీక్ కావడంతో ఇంటెలిజెన్స్ ఏడీజీ వినోద్ కుమార్ విచారణను ప్రారంభించారు.
ఎంపిక చేసిన అధికారులకు పంపిన 49 పేజీల సర్క్యులర్‌లో రాష్ట్ర బీజేపీ చీఫ్ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు లేఖతోపాటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పీడీపీ, వెల్ఫేర్ పార్టీ, మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. లీక్ అత్యంత తీవ్రమైనది అని పేర్కొన్నారు. హోం శాఖ బాధ్యతలను నిర్వహిస్తోన్న సీఎం విజయన్ భద్రత వైఫల్యాన్ని చేతులు దులుపుకోడానికి అనుమతించలేమని ఆయన అన్నారు.
బెదిరింపు లేఖ నేపథ్యంలో ప్రధాని కేరళ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. అయితే, షెడ్యూల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు ఉంటాయని కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ ఏప్రిల్ 24 కేరళకు చేరుకుంటారు. కోచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాత్రికి తిరువనంతపురంలో ఉంటారు. మర్నాడు ఉదయం అక్కడ రాష్ట్ర తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు.