పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణ–పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించి.. ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేసిందని కొనియాడింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతోందని మెచ్చుకుంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న బృహత్తర లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలను నిర్మిస్తోందని వివరించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘సరసమైన గృహాలు–ఉత్తమ పద్ధతులు’ అంశంపై అధ్యయనం చేసిన కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇటీవల నివేదికను విడుదల చేసింది.