వంద రోజుల్లో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు, ఆర్ధిక, రాజకీయ కారణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని.. తన మిత్రుడీ కుమారుడు సీఎం అయ్యాడని అనుకున్నా.. కానీ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన నాయకులంతా కాంగ్రెస్‌లోకి రావాలని.. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అసలు బాగోలేదని వ్యాఖ్యానించారు.. ఏపీ పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది అన్నారు.
రాష్ట్రంలో పేదల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని.. మూడు పూటల్లో రెండు పూటలు కూడా గడవని పరిస్థితి ఉందన్నారు. తాను రాష్ట్రంలో వేలమందిని కలిశానని.. ఆ తర్వాతే ఈ విషయాన్ని చెబుతున్నాను అన్నారు. పేదల చేతిలో కనీసం పది రూపాయలు లేకుండా పోతున్నాయని.. ఓ చదువుకున్న నిరుపేద మహిళ కూడా తన బాధను చెప్పుకుందన్నారు. ఏపీలో పేదల పరిస్థితి దీనాతి దీనంగా ఉందని.. పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు ఆపేశారని ధ్వజమెత్తారు.
దేశ సంపదనను సంపన్నుల చేతిలో పెట్టేస్తున్నారని.. దీనిపై ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్‌గాంధీ కుమారుడిపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేసిన తప్పేంటని.. నీరవ్ మోదీ, లలిత్ మోదీ మోసం చేయలేదా అన్నారు. రాహుల్ గాంధీ ఆ ఇంట్లో ఉంటే కేంద్రానికి ఇబ్బంది ఏంటని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు.