వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాలపై రాష్ట్ర రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రబీలో ఈ- క్రాప్ బుకింగ్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద కిసాన్ డ్రోన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ జులై నెల నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేయగా.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1,500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇక, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీ చర్యలు తీసుకుంటోందని.. విజయనగరంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని.. విదేశాల్లో డిమాండ్ ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. నిరంతరం మాక్ డ్రిల్ చేస్తూ పని తీరును పర్యవేక్షించాలని సూచించారు.
ఇక, ఖరీఫ్ సీజనల్లో రైతుల దగ్గరి నుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తయ్యాయని.. రూ.7,233 కోట్లకు గాను రూ.7,200 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీంతో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఉండాలన్న కార్యాచరణ దిశగా ముందుకు సాగాలని సూచించారు. దీంతో 1,005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టామని అధికారులు తెలిపారు. వీటిలో 206కు పైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా రష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు అకౌంట్లలో డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. అలాగే, అర్హులైన రైతుల జాబితాలను సిద్ధం చేయాలని.. మే 10వ తేదీ కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.