నెల రోజులకుపైగా పంజాబ్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టి, కంటిమీద కునుకులేకుండా చేసిన ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ఆదివారం ఉదయం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. 80వ దశకంలో ఖలిస్థానీ ఉద్యమాన్ని నడిపిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే స్వగ్రామం రోడెలోనే అమృత్‌పాల్ లొంగిపోయాడు. అయితే, ఈ అరెస్ట్‌లో భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడె కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. లొంగిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టిన అమృత్‌పాల్ సింగ్.. ఈ విషయాన్ని జస్బీర్‌కు తెలియజేశాడు.
దీంతో శనివారం రాత్రి రోడె గురుద్వారాకు చేరుకోవాలని జస్బీర్ సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత అతడు రహస్యంగా పోలీసులకు ఈ విషయం చేరవేశాడు. అమృత్‌పాల్ తన అనుచరుల సమక్షంలో లొంగిపోవాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించాడు. కానీ, అలా అయితే ‘అజ్‌నాల’ వంటి ఘటన పునరావృతం కావచ్చని పోలీసులు అనుమానించారు.
కాగా, ఈ ప్రచారంపై జస్బీర్ స్పందిస్తూ... అమృత్‌పాల్ అరెస్ట్‌లో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచి రోడె గ్రామంలో పోలీసుల కదలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గురుద్వారాకు చేరుకున్న అమృత్‌పాల్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని వెల్లడించారు. అనంతరం తన వెంటతెచ్చుకున్న కిట్‌లోని దుస్తులు మార్చుకొని ప్రార్థనలు నిర్వహించాడని తెలిపారు. గురుద్వారా నుంచి అతడు బయటకు రాగానే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.
సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్‌కు గతంలో జతేదార్‌గా ఉన్న జస్బీర్ సింగ్.. ఏడు నెలల కిందట రోడెలో అమృత్‌పాల్ సింగ్ నిర్వహించిన దస్తర్బంధీకి హాజరయ్యారు. కాగా, తన కుడిభుజం, మాజీ జర్నలిస్ట్ పపల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్‌తో అమృత్‌పాల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకోడానికి అమృత్‌పాల్‌కు ఆశ్రయం, ఆహారం, నిధులను అతడే సమకూర్చేవాడు. దీంతోపాటు అత్యంత కీలకమైన సలహాదారుగా కూడా వ్యవహరించాడు.
ఇదే సమయంలో అకాల్ తఖ్త్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కూడా అమృత్‌పాల్ అనుచరుల కుటుంబాల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాదు.. అమృత్‌పాల్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు అకాల్ తఖ్త్ చీఫ్ జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్ కూడా అమృత్‌పాల్‌ను లొంగిపోవాలని సూచించాడు. దీంతోపాటు సర్బత్ ఖల్సా’ నిర్వహించాలనే డిమాండ్‌ను తోసిపుచ్చాడు. ఇక, పోలీసులకు లొంగిపోయిన సమయంలో అమృత్‌పాల్ వస్త్రధారణ అచ్చం భింద్రన్‌వాలేను తలపించింది. అతడి మాదిరిగానే పసుపు రంగు టర్బైన్, తెలుపురంగు పైజామా ధరించడం గమనార్హం.