కర్ణాటకకు చెందిన ఓ జంట విడాకుల కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు మీ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునేందుకు మరో అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సాఫ్ట్‌వేర్ జంటను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘బెంగళూరులో మీ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఒకరు పగలు ఉద్యోగానికి వెళ్తే..మరొకరు రాత్రి వెళ్తున్నారు.. మీకు దాంపత్యానికి సమయమేది? విడాకులు తీసుకోవడంపై మీకు విచారంలేదు. అయినప్పటికీ పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి రెండో అవకాశం ఎందుకు తీసుకోరు’’ అంటూ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించారు.
‘తిరిగి కలిసుండేందుకు ఈ జంటకు ఓ అవకాశం ఇవ్వాలి’’ అని జస్టిస్ నాగరత్న సూచించారు. అయితే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు నిశ్చయించుకుని ఓ ఒప్పందానికి వచ్చారని వారి తరఫు లాయర్లు ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ జంటకు సుప్రీం కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాశ్వత భరణంగా భార్యకు చివరి సెటిల్‌మెంట్ కోసం మొత్తం రూ. 12.51 లక్షలను చెల్లించాలనేది నిబంధనలలో ఒకటి అని ధర్మాసనానికి న్యాయవాదులు తెలియజేశారు.
‘ఈ కోర్టు ప్రశ్నించినప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోవడం, విడాకులు కోరడం ద్వారా తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అంగీకరించామని పార్టీలు పేర్కొన్నాయి.. అలాగే సెటిల్‌మెంట్ షరతులు కూడా ఉన్నాయి.. వీటికి కట్టుబడి పరస్పర అంగీకారంతో విడాకుల డిక్రీ ద్వారా వివాహం రద్దవుతుంది’ అని ఏప్రిల్ 18 నాటి ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.
‘మేము సెటిల్‌మెంట్ ఒప్పందాన్ని అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద దాఖలు చేసిన దరఖాస్తును నమోదు చేశాం... మా పరిశీలనలో సెటిల్‌మెంట్ ఒప్పందాల నిబంధనలు చట్టబద్ధమైనవని, వాటిని అంగీకరించడానికి ఎటువంటి చట్టపరమైన అవరోధం లేదని గుర్తించాం’ అని వ్యాఖ్యానించింది.