‘‘వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ అడుగులకు మడుగులు వత్తుతున్నాయి’’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజితా రంజన్ ధ్వజమెత్తారు. పీసీసీ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో జై భారత్ సత్యాగ్రహ సభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని, జీవనాడి పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రధానమంత్రి స్నేహితుడు గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దత్తపుత్రుడులా మారారు. ఆయన కోసమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. అయినా ఈ రాష్ట్రంలో ఉన్న అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి సాహసించడం లేదు. దేశంలోను, రాష్ట్రంలోను రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోంది. కేంద్రంలో అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐలు దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అదానీ కంపెనీలకు వచ్చిన ఆదాయం గురించి ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేంద్రం అనర్హత వేటు వేసింది. అక్కడితో ఆగకుండా ఆగమేఘాల మీద ఆయన నివాసాన్ని ఖాళీ చేయించింది. దేశంలో ఉన్న మతతత్వ పాలనను ఇంటికి పంపించి, సెక్యూలర్ రాజ్యాన్ని స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీ జై భారత్ సత్యాగ్రహ సభలను నిర్వహిస్తోంది’’ అని అన్నారు. ఏఐసీసీ సమన్వయకర్త కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ... ‘‘వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ. ఆయన కుటుంబ సభ్యులు సీఎం అయితే వైఎస్ ఆత్మ శాంతిస్తుందో లేదో తెలియదు. కానీ రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే మాత్రం వైఎస్ ఆత్మ శాంతిస్తుంది’’ అని అన్నారు.