ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కైకలూరు మండలం, ఉప్పుటేరు సెంటర్లో వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... రామవరం గ్రామానికి చెందిన దర్శి కిరణ్ (18) అతని స్నేహితుడు ఇంటి లక్ష్మణ్‌తో కలసి బైక్‌పై ఉప్పుటేరు సెంటర్లో ఎలక్ట్రికల్ షాపు వద్దకు వచ్చాడు. సుమారు నెల రోజుల క్రితం జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని కలిదిండి మండలం చిన్నతాడినాడకు చెందిన యువకులు కిరణ్‌పై దాడి చేశారు. అనంతరం కిరణ్‌ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చిన్నతాడినాడ గ్రామానికి తీసుకువెళ్లి మరోసారి దాడి చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న రామవరం యువకులు పెద్దఎత్తున ఉప్పుటేరు సెంటర్‌కి చేరుకున్నారు. కిరణ్ కోసం గాలిస్తున్న సమయంలో చిన్నతాడినాడ సర్పంచ్ గండికోట ఏసుబాబు కిరణ్‌ను తీసుకువచ్చి రామవరం యువకులకు అప్పగించాడు. దీంతో చిన్నతాడినాడ సర్పంచ్‌పై రామవరం యువకులు వాగ్వాదానికి దిగారు. కిరణ్‌పై దాడి చేసిన వారిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కైకలూరు రూరల్ పోలీసులు, కలిదిండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరణ్‌పై దాడి చేసిన వారిని తీసుకువచ్చి ఉప్పుటేరు సెంటర్లో న్యాయం చేయాలని అప్పటివరకు కిరణ్ ఆసుప్రతికి తీసుకు వెళ్లేందుకు కూడా నిరాకరించి రహదారిపై ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు సర్ధిచెప్పి దెబ్బలు తిన్న కిరణ్‌ను తమ జీపులో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రామవరం యువకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. కిరణ్ బంధువులు కైకలూరు రూరల్ పోలీసులకు ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు.