పోలీసు డ్రెస్ వేసుకోలేదని మహిళా పోలీసులను సస్పెండ్ చేయడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. గ్రామ, వార్డు, సచివాలయాల్లో మహిళా పోలీసులుగా నియమితులైన వారికి పోలీసు విధులు అప్పగించడంపై గతంలో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో జీవోను ఉపసంహరించుకుంటామని కోర్టుకు ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ మరో జీవోను విడుదల చేసి పోలీస్ డ్రెస్, పోలీస్ విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుందంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పోలీసు డ్రెస్ వేసుకోలేదని కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వ సస్పెన్షన్ ఉత్తర్వులపై సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగగా సిబ్బంది తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు.. ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే విధించింది.