పెద్ద నోట్ల రద్దు మనదేశంలో ఎలాంటి మార్పు తీసుకురాకపోయినా అదే బాటలో పయనించాలని మనదాయదీ దేశం పాకిస్తాన్ యోచిస్తున్నట్లుతెలుస్తోంది. ఇదిలావుంటే ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటగా.. సామాన్యులకు బతుకు భారంగా మారింది. ప్రభుత్వానికి సైతం ఈ అనిశ్చితి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్.. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి భారత్ బాటలో నడవాలని పాక్ ఆర్థిక వేత్త అమర్ ఖాన్ సలహా ఇచ్చారు. భారత్ పెద్ద నోట్లను రద్దు చేసిన తరహాలో 5 వేల రూపాయల నోటును రద్దు చేయాలని పాక్ ప్రభుత్వానికి ఆయన సూచిస్తున్నారు. భారత్‌లో నోట్ల రద్దు అద్భుతంగా పని చేసిందని.. దాని ప్రభావంతో పన్ను వసూళ్లు పెరిగాయన్నారు. అమర్ ఖాన్ పాడ్ కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్థానీల దగ్గర 8 లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు ఉందని అమర్ ఖాన్ తెలిపారు. దాని సరిగ్గా వాడుకోవాలంటే నోట్ల రద్దు ఒక్కటే మార్గమన్నారు. ‘‘పాకిస్థాన్‌లో ప్రతి లావాదేవీ నగదు రూపంలోనే జరుగుతోంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన బండిలో పెట్రోల్ పోయించాడనుకుంటే.. పెట్రోల్‌ను బయట నుంచి డాలర్లలో దిగుమతి చేసుకుంటున్నాం. కానీ వినియోగదారుడు మాత్రం నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఇన్‌ఫార్మల్ ఎకానమీ నుంచి వచ్చిన డబ్బును అతడు ఫార్మల్ ఎకానమీకి చెల్లిస్తున్నాడు. ఈ ఇన్‌ఫార్మల్ ఎకానమీలో పన్నులేవీ చెల్లించడం లేదు. ఇక్కడే అసలు సమస్యంతా ఉంది’’ అని ఆ ఆర్థిక వేత్త తెలిపారు.
నగదు వ్యవస్థలోకి వస్తే.. దాన్ని ఉత్పాదకతకు ఉపయోగించుకోలేమని ఆ ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు. బ్యాంకుల దగ్గర నగదు లేకపోవడంతో అవి అప్పులు ఇవ్వలేకపోతున్నాయన్నారు. ఈ 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి వచ్చేస్తే.. వాటి దగ్గర మిగులు నిధులు ఉంటాయన్నారు. అందుకోసం రూ.5 వేల నోట్లను రద్దు చేయాలన్నారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కోసం పాకిస్థాన్ 2019లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో బెయిలవుట్ 6.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేసింది. కానీ ఐఎంఎఫ్ నిబంధలను సరిగా పాటించకపోవడంతో ఇప్పటి వరకూ అందులో సగం మొత్తాన్ని కూడా వాడుకోలేకపోయింది.
2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నోట్లను వెనక్కి ఇచ్చేందుకు ప్రజలు బ్యాంకుల ముందు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చింది. నోట్ల రద్దు తర్వాత దేశంలో కరెన్సీ నోట్ల చలామణి తగ్గి, యూపీఐల వాడకం పెరిగింది. ప్రజలు స్మార్ట్ ఫోన్ల సాయంతో డిజిటల్ చెల్లింపులు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa