ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్సీపీలో ఏం జరగబోతోంది.. ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

national |  Suryaa Desk  | Published : Tue, May 02, 2023, 09:43 PM

గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏదో జరగబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని శరద్ పవార్ నిర్ణయించడం ఆ పార్టీ కార్యకర్తలతోపాటు మహారాష్ట్ర వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి పవార్ కుమార్తె సుప్రియా సూలే కొద్ది రోజుల క్రితమే ఈ దిశగా సంకేతాలిచ్చారు. ఏప్రిల్ 19న ఆమె మాట్లాడుతూ.. 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు (భూకంపాలు) వస్తాయని చెప్పారు. ఆమె ఈ మాట చెప్పిన 13వ రోజే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 24 ఏళ్లపాటు ఆయన ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సుప్రియ చెప్పిన రెండో భూకంపం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.


గతంలో శరద్ పవర్ ప్రాతినిధ్యం వహించిన బారామతి నియోజకవర్గ ఎంపీగా సుప్రియ సూలే వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 19న ఆమె మాట్లాడుతూ.. ‘15 రోజుల్లో రెండు భూకంపాలను చూడబోతున్నారు. ఒకటి న్యూ ఢిల్లీలో, మరొకటి మహారాష్ట్రలో’ అని అన్నారు. శరద్ పవార్ రాజీనామా మొదటి భూకంపం అనుకుంటే మరి రెండోది ఏంటి..? శరద్ పవార్ అన్న కొడుకు, ఎన్సీపీ నాయకుడైన అజిత్ పవర్‌పై గత కొద్ది రోజులుగా అందరి దృష్టి ఉంది. మహారాష్ట్రలోని షిండే సేన-బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రియ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఉద్దవ్ ఠాక్రే‌పై తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్‌నాథ్ షిండే బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపట్టి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇలాంటి తరుణంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇవ్వాలని చూస్తుండగా.. ఎన్సీపీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది ఆయన నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. ప్రఫుల్ పటేల్, సునీల్ తాత్కరే, చగున్ భుజ్బల్, ధనంజయ ముండే లాంటి కీలక నేతలు అజిత్ ఉద్దేశం పట్ల సముఖంగా ఉన్నారట.


ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో.. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుండగా.. ఈ కేసులో సుప్రీం కోర్టు మరి కొద్ది రోజుల్లోనే తీర్పు వెలువరించనుందని తెలుస్తోంది. ఒకవేళ షిండే వర్గానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు వస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అజిత్ పవార్, అతడి ఎమ్మెల్యేల మద్దతు అనివార్యం కానుంది.


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు కాస్తంత ఊపిరి పీల్చుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే దీనికి సరైందని భావిస్తున్నారు. అలాగని శరద్ పవార్‌ను కాదని ముందుకెళ్లే ధైర్యం అజిత్ పవార్ చేయలేరు. శరద్ ఆశీస్సులు లేకుండా ముందుకెళ్లినా అది సత్ఫలితాన్ని ఇవ్వదు. ఈ విషయం చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. గతంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించినప్పుడు శరద్ పవార్ ఆ నిర్ణయం పట్ల సుముఖంగా లేరు. దీంతో అజిత్‌కు చేదు అనుభవమే ఎదురైంది.


ఇప్పుడు పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే పార్టీ యువ విభాగం భేటీలో శరద్ పవార్ మాట్లాడుతూ.. గుప్తమైన అర్థం ధ్వనించే ఓ మాట చెప్పారు. ‘‘రొట్టెను కాల్చేటప్పుడు సరైన సమయంలో తిప్పేయాలి లేదంటే అది చేదుగా మారుతుందని నాతో ఎవరో చెప్పారు’’ అని అన్నారు. అజిత్ పవార్ తదుపరి అడుగులను ఉద్దేశించి శరద్ పవార్ ఈ మాట అని ఉంటారని చాలా మంది భావించారు.


శరద్ మాటల పట్ల అజిత్ పవార్ స్పందిస్తూ.. కొత్త ముఖాలను తెచ్చే సంప్రదాయం ఎన్సీపీలో ఉందన్నారు. శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాను లేదా సుప్రియ ఈ కమిటీలో ఉంటామన్నారు. సరైన సమయంలో రొట్టెను తిప్పాలంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇప్పుడు సమయం వచ్చినట్టే భావిస్తున్నారు. మరి ఈ రెండు రోజుల్లో ఢిల్లీలో ఏమవుతుందో చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa