తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాదం జరిగిందిజరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..... బుచ్చినాయుడుపల్లె అరుంధతివాడకు చెందిన శేఖర్(27) తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తనింట్లోని బాత్రూమ్లో బల్బు వెలగక పోవడంతో మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబీకులు వెంటనే చంద్రగిరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం శేఖర్ తల్లి చెంగమ్మ(55)కు తెలియడంతో ఆమె గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. గ్రామస్తులు వెంటనే ఆమెను చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లీకొడుకు వెంటవెంటనే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. తమ గ్రామంలో ఇదివరకే విద్యుత్ సమస్యలు కారణంగా షాక్కు గురై ఇద్దరు మృతి చెందారని, దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.