విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని భట్టిప్రోలు బస్టాండ్ సెంటర్లో బుధవారం నినాదాలు చేసి, రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబు మాట్లాడుతూ మూడు లక్షల కోట్లు విలువచేసే విశాఖ ఉక్కు పరిశ్రమని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు 3000 కోట్లకు అమ్మాలని చేసిన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది బలిదానంతో 30 గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ భూమిని త్యాగం చేస్తే విశాఖ ఉక్కు ను పోరాడి సాధించుకున్నామని, రెండు సంవత్సరాల నుండి విశాఖ ఉక్కు గేటు వద్ద కార్మికులు చేస్తున్న పోరాట ఫలితంగానే నేటికీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయలేకపోతున్నారని, ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మరింత ఉధృతం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోగలుగుతామని తెలిపారు. అలాగే పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఎం, సిపిఐ బాపట్ల జిల్లా నాయకులు, టి. కృష్ణమోహన్, జి. బాలాజీ, మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందని అటువంటి బిజెపిని ఆంధ్ర రాష్ట్రంలోని అధికార పార్టీ గట్టిగా మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, కొత్త పరిశ్రమలు రాకుండా బిజెపి అడ్డుపడుతుందన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు బాపట్ల జిల్లా నాయకులు జి. సుధాకర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ కి సొంత గనులు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అయినటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, పోస్టల్, బ్యాంకులు మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, కార్మిక చట్టాల్ని కాపాడాలని, ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.