విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వాసా నగేశ్ ఇంట్లో ఏలూరు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లోగడ ద్వారకా తిరుమల దేవస్థానం సూపరింటెండెంట్‌గా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆయనపై పలు ఫిర్యాదులు అందాయి. ద్వారకా తిరుమల దేవస్థానంలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ భవానీపురంలోని లోటస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో ఒక బృందం, ఆలయంలోని ఏవో కార్యాలయంలో ఒక బృందం, ద్వారకా తిరుమల, నిడదవోలు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, ఆయన బంధువుల నివాసాల్లోనూ మరికొన్ని బృందాలు తనిఖీలు చేశాయి. రాజమహేంద్రవరం ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో నివసిస్తున్న వాసా నగేశ్ సోదరుడు సురేశ్ ఇంట్లో సోదాలు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని నగేశ్‌కు చెందిన అపార్టుమెంట్‌లో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ద్వారకా తిరుమలలో కొన్ని ముఖ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.