ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ప్లాంటుకు ఆర్థిక సాయం చేయాలని కార్మిక సంఘాలు కోరుతుంటే.. కేంద్రం మాత్రం ప్లాంట్ ఆస్తులు అమ్ముకోవాలని సలహా ఇచ్చింది. ఆ మేరకు అనుమతులు కూడా జారీ చేసింది. విశాఖ ప్లాంటుకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటు (రైలు చక్రాలు తయారు చేసే కర్మాగారం), విశాఖలోని హెచ్‌బీ కాలనీలో ఉన్న 24 ఎకరాల భూమిని అమ్ముకోవడానికి పచ్చజెండా ఊపింది. విశాఖ ఉక్కు కర్మాగారం నిలదొక్కుకోవడానికి రుణాలు ఇప్పించాలని, నిర్వహణ మూలధనం సమకూర్చాలని, ముడి పదార్థాలు సరఫరా చేయాలని ఇక్కడి అధికారుల సంఘం, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. విశాఖ ప్లాంటుకు ఉత్తరప్రదేశ్‌లో ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటు ఉంది. దానికి సుమారుగా రూ.2,250 కోట్ల పెట్టుబడి పెట్టారు. అక్కడ ఏడాదికి లక్ష చక్రాలు తయారు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక వనరుల కొరత, తగిన అనుభవం లేకపోవడంతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగడం లేదు. గతేడాది రెండు వేల చక్రాలే తయారు చేశారు. ఇప్పుడు ఆ ప్లాంటును అమ్ముకొని ఆ డబ్బులతో విశాఖ ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్–3ని వినియోగంలోకి తేవడానికి ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది. దీనికి సంబంధించి ఢిల్లీలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సెక్రటరీల సమావేశంలో ఆమోదం తెలిపారు. దీంతో పాటు విశాఖపట్నంలోని హెచ్‌బీ కాలనీలో ఆర్‌ఐఎన్‌ఎల్ పేరిట ఉన్న 24 ఎకరాల భూమిని అమ్ముకోవడానికి పచ్చజెండా ఊపారు. ఈ రెండింటి ద్వారా ఎంత సొమ్ము వస్తుందనేదానిపై అంచనా లేదు.