మండవల్లి లబ్దిదారులంతా త్వరితగతిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి ఎంపిడిఒ పి. మల్లేశ్వరి సంబంధిత అధికారులకు సూచించారు. మండవల్లి మండల పరిషత్ కార్యాలయంలో గృహ నిర్మాణ ఇంజినీరింగ్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బేస్ మెంట్ పూర్తయిన వారు గుమ్మాలు, గోడ, అనంతరం శ్లాబ్ నిర్మించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ఇల్లు నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట విద్యుత్, కుళాయిల సౌకర్యం కల్పించాలని సూచించారు. గృహనిర్మాణ లబ్ధిదారులతో తప్పనిసరిగా ఇకెవైసి చేయించాలన్నారు. గృహాలు నిర్మించుకునే క్రమంలో తలెత్తున సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు.