పల్నాడు జిల్లా, మాచర్ల, దుర్గి ప్రాంతాలలో పులుల సంచారం కలకలం రేపుతోంది. టైగర్ రిజర్వు ఫారెస్ట్ నుంచి రెండు పులులు బయటకు వచ్చి సమీప గ్రామాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖాధికారులే నిర్ధారించారు. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులులు దాడి చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలంలో టెన్షన్ నెలకొంది. సాధారణంగా పులులు రోజుకు 50 కి.మీ.లు దాకా నడుస్తుంటాయి. దీన్ని బట్టి అంచనా వేస్తే పై మూడు మండలాల్లో అడవి నుంచి బయటకు వచ్చిన పులుల సంచారం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో 75 దాకా పులులు ఉన్నాయి. వీటిలోని రెండు పులులు అడవిని దాటి బయటకు వచ్చాయి. దీంతో ఆయా మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దుర్గి మండల పరిధిలోని కాకిరాల, గజాపురం గ్రామాల్లో డీఎఫ్‌వో రామచంద్రారావు పర్యటించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. పులుల జాడ కోసం ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట వెంకయ్య, వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.