ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు. పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. పది పరీక్షల ఫలితాలపై సమీక్షించి పది రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని, వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి తెలిపారు.