టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్‌ను ముందుగా మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్ర చేరుకోగా.. యువనేతను జిల్లా న్యాయవాదుల కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని జగన్ తరలించారన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారని తెలిపారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టులో వైసీపీ ప్రభుత్వం తెలిపిందని.. విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పారన్నారు. జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత మాట్లాడుతూ.. జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదన్నారు. బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.