రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతిఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలో భాగంగా సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో ఏపీయూడబ్ల్యుజే జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనుపల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సర్క్యులేషన్ మూడు లక్షలకు పైబడి ఉంటేనే ప్రతి మండలానికి ఒక అక్రిడిటేషన్ ఇస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేయడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విలేకరులకు ఇచ్చే అక్రిడిటేషన్‌పై కూడా ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం భావ్యం కాదన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారమై బతుకుతున్న ప్రతి జర్నలిస్టులకు హెల్త్‌కార్డు కూడా ఇవ్వాలని కోరారు. అనంతరం ఈ విషయంపై కలెక్టర్ పీఎస్ గిరీషాకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.