మన పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. నానాటికీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బయటి నుంచి అప్పు పుట్టక.. ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతూ.. పాకిస్థాన్ పరిస్థితి మరో శ్రీలంకలా తయారవుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. తమ హజ్ కోటాను పాకిస్థాన్ సౌదీ అరేబియాకు అప్పగించింది. గత 75 ఏళ్ల పాక్ ఇలా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాక్ నిర్ణయంతో వేలాది మంది పాకిస్థానీలు ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల పాకిస్థాన్‌కు 24 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా.
ఏప్రిల్ నాటికి పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుకొని 36.4 శాతంగా ఉంది. అప్పుల కోసం అర్రులు చాస్తున్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అందించే నిధులు ఎంతో కీలకం. కానీ ఐఎంఎఫ్ నిబంధనలను పాకిస్థాన్ అమలు చేయలేకపోతోంది. దీంతో ఐఎంఎఫ్ డబ్బులు ఇవ్వడానికి ససేమీరా అంగీకరించడం లేదు. ఇమ్రాన్ అరెస్ట్ వ్యవహారం పాక్‌ను ఓ కుదుపు కుదుపుతోంది.
ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే.. పాకిస్థాన్ భారత్‌పై అక్కసు ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. ఉగ్రవాదులను ఎగదోసి మనపై కసి తీర్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. షాంఘై సదస్సు కోసం ఈ మధ్య గోవా వచ్చిన పాక్ విదేశాంగ మంత్రికి మన విదేశాంగ మంత్రి జై శంకర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు. పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది కాబట్టి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన తరుణమని కొందరు సూచిస్తున్నారు.
కానీ కశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా మాత్రం మరోలా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ అస్థిరత మనకు ప్రమాదకరం అంటున్నారు. పాకిస్థాన్ స్థిరంగా ఉండటం (అనిశ్చితి నుంచి బయటపడటం) మనకు అవసరమన్న ఆయన.. ఉపఖండంలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే పాక్ బాగుండాలన్నారు. అది మన పొరుగు దేశం.. ఏదైనా మేలు జరుగుతుందని.. ప్రజలు ప్రశాంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నానని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ జిందాబాద్ అనడంతో ఏమైందో చూడండి.!
‘పాకిస్థాన్ చరిత్రను గమనిస్తే.. ప్రధానులను హతమార్చడం అనేది స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి జరుగుతోంది. అస్థిరతతో కూడిన పాకిస్థాన్.. భారతదేశానికి ప్రమాదకరం. పాకిస్థాన్ స్థిరత్వం మనకు అవసరం. ఉపఖండంలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే ఇది అవసరం. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇటీవల బలూచిస్థాన్‌లో వచ్చిన వరదలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని ఆశిస్తున్నాం. మన పొరుగు దేశం బాగుండాలని కోరుకుంటున్నా. వారికి మంచి జరగాలని.. అక్కడి ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నా’ అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa