రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసులు, గ్రామ బహిష్కరణలు, హత్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని, వారిని మరింత వెనుబాటు తనానికి, పేదరికంలోకి నెట్టే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని పేర్కొన్నారు. మైనార్టీలపై దాడులు చేసే నేరస్తులను ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని లేఖలో పేర్కొన్నారు. చాలా ఘటనల్లో వైసీపీ శ్రేణులే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడితే, అధికార పార్టీ ఒత్తిళ్లతో కొంత మంది పోలీసులు నేరస్తులతో చేతులు కలిపి, కేసులు నీరుగారుస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలపై చోటు చేసుకున్న 50 ఘటనలు, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, పల్నాడులో ముస్లిం మైనార్టీల హత్యలు, ఆస్తుల ధ్వంసం, గ్రామ బహిష్కరణలతో సహా తన దృష్టికి వచ్చిన ఇతర సంఘటనల వివరాలను గవర్నర్‌కు రాసిన లేఖకు జత చేశారు.ఈ దాష్టీకాలపై సమగ్ర విచారణ జరిపి, దోషులను చట్టప్రకారం శిక్షించేలా చూడాలని, బాధితులను కాపాడటంతో పాటు మైనార్టీలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు.