భీమిలి మండలం చిప్పాడ సమీపంలోని ఆశిపాలెంలో తన మేనమామ కుమార్తె పెళ్లిచూపుల కార్యక్రమానికి తన వద్ద ఉన్న సుమారు పది తులాల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లడానికి తనకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ రాజుతో రీసు గోపి ఈ నెల 1న ఉదయం 10 గంటలకు వెళ్లింది. కార్యక్రమం పూర్తయిన తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు తన అక్కకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తున్నట్టు చెప్పింది. ఆమె ఎంతకీ రాకపోవడంతో ఆమె అక్క కుమారుడు శ్రీను ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చార్జింగ్ అయిపోయిందేమోనని అనుకున్నాడు. రాత్రి అయినా రాకపోవడంతో బంధువులు, స్నేహితులను వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవడంతో మర్నాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఆటో డ్రైవర్ రాజుతో మూడేళ్లుగా పరిచయం ఉండడంతో అతనితో ఆటోలో తన మేనమామ ఇంటికి గోపి వెళ్లింది. పేకాటకు అలవాటు పడి అప్పులపాలైన రాజుకు ఆమె బంగారు ఆభరణాలపై కన్నుపడింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఆటోలో తిప్పుతూ సాయంత్రం అయ్యేసరికి బోయిపాలెం సమీపంలోని రెస్టారెంట్‌కు, అక్కడ నుంచి చిలుకూరి లేఅవుట్, ఆ తరువాత చేపలుప్పాడ వెళ్లే గ్రావెల్ రోడ్డులోకి ఆటోను తీసుకువెళ్లాడు. గంభీరం గెడ్డ వద్ద ఆటో ఆపి తనకు అప్పులు ఉన్నాయని, బంగారు ఇస్తే తాకట్టు పెట్టుకుని అప్పులు తీర్చుకుంటానని చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆటోను స్టార్ట్ చేసే వైర్‌తో ఆమె మెడను బిగించి హత్య చేశాడు. ఆమె బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ తీసుకుని మృతదేహాన్ని గంభీరం గెడ్డలో పడేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ బంగారు వస్తువులను ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.లక్షా 50 వేలు రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆఖరికి మంగళవారం అర్ధరాత్రి మంగమారిపేటలో పోలీసులకు చిక్కాడు. రాజు అదుపులో వున్నాడని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు రాజు తన జేబులో పురుగుల మందు సీసా పెట్టుకుని వుండడాన్ని పోలీసులు గుర్తించారు.