వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పొచ్చు. జీవో నెం.1 ను కొట్టివేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రంలో సభలు, రోడ్‌షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ను తీసుకువచ్చింది. ఈ జీవోను సీపీఐ నేత రామకృష్ణ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణ తరపున లాయర్ అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో తెచ్చారని, పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ మేరకు జీవో నెం.1ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.