ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది రోజుల క్రితం వైసీపీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉదయగిరి వైసీపీలో నాలుగు వర్గాలుగా విభజించి.. అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని అన్నారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌కే పేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం కూడా దుత్తలూరులో చిరకాల రాజకీయ శత్రువు అయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగించారు. మేకపాటి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే చర్చలు అప్పట్లోనే సాగాయి. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని మేకపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.