ఉక్కపోత కరెంటు కోతలతో రాజాం ప్రజలు అల్లాడిపోతున్నారు. నిప్పుల కుంపటిలా ఎండలు ఇటీవల మండిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు గాలి లేకపోవడం ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండ వేడిమితో ఉక్కపోత మొదలవుతుంది. మే నెలలో ఎండలు ఉండటం సాధారణమే. అయితే ఈసారి ఎండకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు నీరసపడిపోతున్నారు. పగలు వాహనదారులు ప్రయాణించలేక చెట్ల కింద సేదా తీరుతున్నారు. రోడ్ల పక్కన విక్రయిస్తున్న తాటి ముంజలు, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, చెరుకు రసం, బాదం మిల్క్ సేవిస్తూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. పగటిపూట మాడు పగిలేలా ఎండలు ఉన్నప్పటికీ రాత్రి సమయములో రెండు రోజుల నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి.