రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎండ ప్రభావం, వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. ఈరోజు మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండనుంది. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.