శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని రైల్వే గేటు వద్ద పోలీసు తనిఖీల్లో పెద్దఎత్తున నకిలీ కరెన్సీ, బంగారం పట్టుబడింది. ఈ వివరాలను ఎస్పీ మాధవరెడ్డి పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. ముదిగుబ్బ రైల్వేగేటు సమీపంలో ఈ నెల 16న ధర్మవరం వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం, ముదిగుబ్బ సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐ హేమంతకుమార్.. సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కదిరి వైపు నుంచి వస్తున్న కారు పోలీసులను గమనించి దారి మళ్లింది. దీంతో పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బుక్కే గోవిందనాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా.. రూ.21 లక్షల నకిలీ కరెన్సీ కనిపించింది. నకిలీ రూ.500 నోట్లు, రూ.100 నోట్లను 42 కట్టలు కట్టినట్లు గుర్తించారు. దీంతోపాటు 500 రూపాయల ఒరిజినల్ నోట్లు 4, ఒక 50 గ్రాముల ఒరిజినల్ బంగారం బిస్కెట్, 50 గ్రామలు, 102 గ్రాముల రెండు నకిలీ బంగారం బిస్కెట్లు, 185 గ్రాముల నకిలీ బంగారం చైన లభించాయి. వీటన్నింటినీ సీజ్ చేసి, కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు బుక్కే గోవిందనాయక్‌పై ఇదివరకే కదిరి రూరల్ పోలీసు స్టేషనలో రెండు డెకాయిట్ కేసులు ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు వనటౌన పోలీసు స్టేషనలో రెండు కేసులు, తనకల్లు పోలీసు స్టేషనలో చీటింగ్ కేసు ఉన్నాయని ఎస్పీ వివరించారు.