యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.2 కోట్లు నిరుద్యోగుల నుంచి వసూలు చేసి ఆపై కనిపించకుండా వెళ్లిపోయిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించాక అరెస్టు చేశారు. ఎస్‌ఐ ఆర్.రమేష్ బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెరుమాళి గ్రామానికి చెందిన భార్యభర్తలు బేరి గంగాధర్, పూర్ణచందన ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.2 కోట్లు నిరుద్యోగుల నుంచి వసూలు చేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ఎవరికీ కనిపించకుండా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. చివరికి చీపురుపల్లిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించాక బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని వారు చెప్పిన మాటలను చాలా మంది నమ్మేశారు. పెరుమాళి, నెమలాం, రాజాం, నరసన్నపేట తదితర గ్రామాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ బాధితులు ఉన్నారు. లక్షల్లో డబ్బులు ఇచ్చారు. కొన్నాళ్ల కిందట రూ.22వేల జీతంతో నకిలీ ఆర్డర్లు సృష్టించి, నకిలీ గుర్తింపు కార్డులు, జాబ్ కార్డులు తయారు చేసి బాధితులకు ఇచ్చారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన పెరుమాళి గ్రామానికి చెందిన బేరి ప్రశాంత్‌కుమార్, తోలేటి రాజేష్, బాలరాజు, భుజంగరావు, ఉచ్చల గురుమూర్తి తదితరులు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సంవత్సరాల నుంచి నిందితులు వేర్వేరు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నారు. ఎట్టకేలకు చీపురుపల్లిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు సిబ్బందితో దాడిచేసి భార్యభర్తలను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారించాక తప్పును అంగీకరించారని, అరెస్టు చేసి బొబ్బిలి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించిందని ఎస్‌ఐ తెలిపారు.