సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నేరస్తుల నేరచిట్ట ఇట్టే బహిర్గతమవుతోంది. విధుల్లో ‘లేడీ సింగం’గా పేరు తెచ్చుకున్న అస్సాంకు చెందిన మహిళా ఎస్సై జున్‌మోనీ రాభా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణంపై తల్లిదండ్రులు అప్పుడే అనుమానాలు వ్యక్తం చేయగా, తాజాగా వాటిని బలపరిచేలా ఉన్న ఆడియో క్లిప్‌తోపాటు వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి కలకలం రేపుతోంది.
పోలీసు శాఖలోని కొందరు అధికారులు రాభాను చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్ ఆడియో క్లిప్‌ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, రాభా ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనలేదని, నిలిపి ఉన్న కారును ట్రక్కే వచ్చి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న వ్యక్తి ఒకరు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అంతేకాదు, ట్రక్కు ఢీకొనడానికి ముందు కారులోంచి ఇద్దరు వ్యక్తులు దిగినట్టు కూడా అందులో పేర్కొన్నాడు. రాభా మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆడియో క్లిప్‌ను విడుదల చేసిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.