రాయలసీమ రైతుల పాలిట శని జగన్ అని... రాయలసీమ బిడ్డనని చెబుతూ ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయకుండా తీరని ద్రోహం చేస్తున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద రైతులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మాలి అంటే భయపడేవారని వెల్లడించారు. జగనే 420 కాబట్టి ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు.
"జగన్ తన చేతగానితనాన్ని వాతావరణంపై తోసేసి రైతులకు అన్యాయం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు తగ్గించి వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం" అని తెలిపారు.