విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ బస్సు డ్రైవర్ పై ఢిల్లీలోని అరవింద్ కేజ్రివాల్ సర్కార్ వేటు వేసింది. బస్టాప్‌లో వేచి చూస్తున్న మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్‌పై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం వేటేసింది. బస్టాపులో ఓ ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్ చేసింది.
మహిళా ప్రయాణికులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలను ఎక్కించుకునేందుకు పురుష డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన సీఎం కేజ్రీవాల్.. అలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుష, మహిళా డ్రైవర్లు స్టాపుల్లో బస్సును ఆపాల్సిందేనని అన్నారు.
మహిళల కోసం బస్సు ఆపని సందర్భాల్లో ఎవరైనా ఆ ఘటనను వీడియో తీసి షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. తాజా ఘటనకు సంబంధించి డ్రైవర్, సిబ్బందిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైవర్‌కు ఇలాంటి స్వభావం ఉండడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.